Wednesday, 15 July 2015

Post-3: TEN MOST POPULAR DEVOTIONAL DANDAKAMS FROM OLD TELUGU CLASSIC MOVIES

1."శ్రీ కాళహస్తీశ్వర దండకం" (చిత్రం:కాళహస్తి మహాత్మ్యం)(1954)

దంII జయ జయ మహాదేవ శంభో హరా శంకరా! సత్య శివ సుందరా! నిత్య గంగాధరా! బ్రహ్మ విష్ణుల్ సురల్ తాపసుల్ నిన్ను వర్ణించలేరన్న నేనెంత వాడన్, దయాసాగరా! భీకరారణ్య మధ్యంబునన్ బోయనై పుట్టి, పశుపక్షి సంతానముల్ కూల్చి భక్షించు పాపాత్ముడన్, దివ్య జప హోమ తప మంత్ర కృషిలేని జ్వాలాంధుడన్, దేవుడే లేడులేడంచు దూషించు దుష్టాత్ముడన్, విశ్వరూపా! మహామేరుచాపా! జగత్సృష్టి సంరక్ష సంహార కార్యత్కలాపా! మహిన్ పంచభూతాత్మవీవే కదా, దేవదేవా! శివా! పృధ్వి జల వాయు రాకాశ తేజో విలాసా! మహేశా! ప్రభో! రంగు బంగారు గంగా తరంగాల రాజిల్లు కాశీపురాధీశ విశ్వేశ్వరా! నీలి మేఘాల కేళీ వినోదాలలో దేలు శ్రీశైల మల్లేశ్వరా కోటి నదులందు సుస్నానముల్ చేయు ఫలమిచ్చు క్షేత్రాన వసియించు శ్రీరామలింగేశ్వరా నిత్య గోదావరీ నృత్య సంగీత నీరాజనాలందు ద్రాక్షారమావాస భీమేశ్వరా దివ్య ఫల పుష్ప సందోహ బృందార్చితానంద భూలోక కైలాస శైలాన వసియించు శ్రీకాళహస్తీశ్వరా దేవదేవా నమస్తే నమస్తే నమస్తే నమః
                                                 కాళహస్తి మహాత్మ్యం

2."శ్రీ పాండురంగ దండకం" (చిత్రం: పాండురంగ మహాత్మ్యం)(1957)
హే కృష్ణ! శ్రీకామినీ కామితాకార! సాకార కారుణ్యధారా! నవాంకూర సంసార సంతాప నిర్వాపణా! పాపనిర్వాపణోపాయ నామ ప్రశంశానుభావా! భవాభావ! శ్రీ వాసుదేవా! సదానంద! గోవింద! సేవింతుమావిందవై డెందమానంద మొందింప యెందున్ విచారంబు లేమిన్, వచో గోచరాగోచరత్వంబు లూహింపలేమైతిమో దేవ! నీ పాద సేవాదరంబున్ మదిన్ గోరుచున్, వేదవాదుల్ శమాదుల్ కడున్ జాల నార్జించి, భోగేఛ్ఛ వర్జించి, నానా తపశ్చర్య తాత్పర్య పర్యాకులత్వంబునన్ గైకొనన్, మాకు నేయత్నముల్ లేకయే నీ కృపాలోక సంసిధ్ధి సిధ్ధించుటల్ బుధ్ధి తర్కింప నత్యంత చిత్రంబుగాదే, జగన్నాధ! (హే జగన్నాధ!)... .... యేరీతి చెన్నార మున్నేరుచున్ నిన్ను గన్నార కన్నారు, నా కన్నులెన్నంగ యే పుణ్యముల్ జేసెనో నిన్ను దర్శింపగా, భవ్య యోగీంద్ర సాంద్రాదరా! కాంక్షితైకాంత సంసేవనా! భావనాతీత! కల్యాణ నానాగుణ శ్రీ సముద్భాసితాంగా! దయాపూర! రంగత్తరాంగంతరంగా! నమో రుక్మిణీ సంగ! హే పాండురంగా! (హే పాండురంగా!) నమస్తే నమస్తే  నమః
                                                 పాండురంగ మహాత్మ్యం

3." శ్రీ శ్యామలాదండకం" (చిత్రం: మహాకవి కాళిదాసు)(1960)
శ్లోII  మాణిక్య వీణా ముపలాలయంతీంI మదాలసాం మంజుల వాగ్విలాసాంI
      మహేంద్ర నీలద్యుతి కోమలాంగీంI మాతంగకన్యాం మనసా స్మరామిII
శ్లోII  చతుర్భుజే చంద్రకళావతంసేI కుచోన్నతే కుంకుమరాగశోణేI
      పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తేI నమస్తే! జగదేకమాతః జగదేకమాతః IIశ్లోII  మాతా! మరకతశ్యామా! మాతంగీ! మధుశాలినీ!
      కుర్యాత్కటాక్షం కల్యాణీ! కదంబ వనవాసినీ...!శ్లోII  జయ మాతంగతనయే! జయ నీలోత్పలద్యుతే! 
      జయ సంగీతరసికే! జయ లీలాశుకప్రియే!

జై జననీ!

దంII సుధాసముద్రాంత ఋద్యన్మణిద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమాకల్ప కాదంబ కాంతారవాసప్రియే! కృత్తివాసప్రియే! సాదరారబ్ధ సంగీతసంభావనా సంభ్రమాలోల నీప స్రగాబద్ధ చూళీ సనాథత్రికే! సానుమత్పుత్రికే! శేఖరీభూతశీతాంశురేఖా మయూఖావళీబద్ధసుస్నిగ్ధ నీలాలకశ్రేణి 
శృంగారితే! లోకసంభావితే! కామలీలా ధనుస్సన్నిభభ్రూలతా పుష్ప సందేహ కృచ్ఛారు గోరోచనా పంకకేళీ
లలామాభిరామే! సురామే! రమే! సర్వయంత్రాత్మికే! సర్వతంత్రాత్మికే! సర్వమంత్రాత్మికే! సర్వముద్రాత్మికే! 
సర్వశక్త్యాత్మికే! సర్వచక్రాత్మికే! సర్వవర్ణాత్మికే! సర్వరూపే! జగన్మాతృకే! హే జగన్మాతృకే! పాహి మాం పాహి మాం, పాహి పాహి!
                                                            మహాకవి కాళిదాసు

4."శ్రీ కనక దుర్గా దండకం" :చిత్రం: కనక దుర్గ పూజ మహిమ (1960)
శ్లోII  ఓంకార పంజర సుఖీంI ఉపనిషదుద్యాన కేళి కలకంఠీంI
       ఆగమ విపిన మయూరీంI ఆర్యాం అంతర్విభావయే గౌరీం... గౌరీం... గౌరీంII
దంII  జయజయ నమో కనకదుర్గా! నమో మోక్షమార్గా! శ్రితానీక దక్షా! నిరాగా! ఘోర దుర్వార దౌర్భగ్య భంగా! అనంగా విభంగా! మహాచండ శృంగత్తురంగా! గౌరీ! సదా భక్త క్షేమంకరీ!  జయకరీ! శంకరీ! శ్రీకర వశంకరీ! వసుధాశుభంకరీ! ఆర్తజన అభయంకరీ! ఆర్తజన అభయంకరీ! పాహీ త్రిలోకైక జననీ! భవానీ! భక్త చింతామణీ! ముక్తి సందాయినీ! ఆర్త సంచారిణీ! ధూర్త సంహారిణీ! కాళీ! కల్యాణి! గీర్వాణి! హ్రీంకారిణీ! అన్నపూర్ణా! అపర్ణాంబ! కాత్యాయనీ! శ్రీచక్ర సింహాసినీ! శాంభవీ! శాంభవీ! భ్రమరాంబ! శ్యామలా! యవ్వనీ! ధగల జ్వాలాముఖీ! కామాక్షి! మీనాక్షి! ద్రాక్షాయణీ!... పేరులే వేరుగా! అందరూ నీవెగా! యీదీను కావగా, రావేల వేగా! అమ్మ, నీ పాదపద్మాలు నమ్మ, వెతలు తీరునమ్మా! నుతులు చేయగా, కొంగు బంగారమమ్మా!...  నా జన్మ కారకులు నీ పూజలను మాని అపరాధములు చేసిరమ్మా! పాపులూ, పుణ్యులూ నీ పాపలే గాన, యీ కోపమింకేలనమ్మా?! కృపజూపవమ్మా! మనోవాంఛితార్ధమ్మునిమ్మా! మొరాలించవమ్మా! పాలించవమ్మా! కనికరించమ్మా! కనికరించమ్మా! కనకదుర్గమ్మాII
                                                కనక దుర్గ పూజ మహిమ

5. "శ్రీ పార్వతీనాధ దండకం" :చిత్రం: సీతారామ కళ్యాణం

హే పార్వతీనాధ! కైలాసశైలాగ్రవాసా! శశాంకాగ్రమౌళీ! ఉమాదేవతోల్లాసితవ్యాంగభాగా! శ్రితానందదాయి శ్మితాపాంగా! భస్మీకృతానంగ! గంగాధరా! సర్వసంతాపహరా! హరా! (శివా! సదాశివా!) నీవున్నచందంబు నేనెంత యూహింపగావచ్చు! వేదమ్ములున్నీవ! వాదమ్ములున్నీవ! ధైర్యంబులున్నీవ! మర్మంబులున్నీవ! సర్వంబునున్నీవ!నీవెన్కనైనట్టి దాసుండనైనట్టి నన్నున్ దయాళుండవై ప్రీతి రక్షింపవే! తప్పు సైరింపవే దేవ! మన్నింపవే దేవదేవా! మహాదేవదేవ! నమస్తే నమస్తే నమఃII
                                                      సీతారామ కళ్యాణం


6. "శ్రీ ఆంజనేయ దండకం" :చిత్రం: పాండవ వనవాసం
ఆంజనేయా! మహానుభావా!
 శ్లోII  మనోజవం! మారుతతుల్య వేగం! జితేంద్రియం! బుధ్ధిమతాం వరిష్ఠం!
       వాతాత్మజం! వానరయూధముఖ్యం! శ్రీరామదూతం! శిరసా నమామి.II
 శ్లోII  భజే రమ్య రంభావనీ నిత్యవాసం! భజే బాలభానుప్రభా చారుభాసం!
       భజే చంద్రికా కుంద మందారహాసం! భజే సంతతం రామభూపాలదాసంII

దంII  జైజై మహా సత్వబాహా! మహా వజ్రదేహా! పరీభూత సూర్య! కృతామస్త కార్యా! మహావీర! హంవీర! హేమాద్రి ధీరా! ధరాజాత శ్రీరామ సౌమిత్రి సంవేష్టితాత్మా! మహాత్మా! నమో వాయుపుత్ర! నమో సచ్చరిత్రా! నమో జానకీప్రాణదాతా! భవిష్యద్విధాతా! హనూమంత! కారుణ్యవంతా! ప్రశాంతా! నమస్తే నమస్తే  నమస్తే నమః.II

శ్లోII  శ్రీరామచంద్రం! శ్రితపారిజాతం! సలక్ష్మణం భూమిసుతా సమేతం!

      లోకాభిరామం! రఘువంశసోమం! రాజాధిరాజం! శిరసా నమామి.II
                                                     పాండవ వనవాసం

7. "శ్రీ కాళహస్తీశ్వర దండకం" :చిత్రం: భక్త కన్నప్ప
 ఓం నమశ్శివాయ!
శ్రీకంఠ! లోకేశ! శ్రీ కాళహస్తీశ! చిద్రూప! కారుణ్య కల్పద్రుమా! భక్త చింతామణీ! ఆర్త రక్షామణీ! సర్వ సర్వజ్ఞ సర్వాత్మకా! నీ పదాబ్జంబులన్ నెమ్మదిన్ నిల్పి, భల్లూక జీవమ్ములేకాగ్రతన్ ఉగ్రతన్ నిన్ను భావించి, సేవింప, సాయుజ్య మిచ్చావు, తండ్రీ! మదాంధుండనై ,మొండినై, నిన్ను దుర్భాషలందెన్ని దూషించినా,  దివ్యలింగమ్ము భంగమ్ము కావింపగా జూచినా, సర్వలోకోత్తరంబైన నీ విశ్వరూపమ్ము జూపించినావే! నన్ను దీవించినావే! కర్మ పరిపక్వమున్ జేసి కైవల్య మీయంగ లేవా! ప్రభో! పాహిమాం... పాహిమాం... పాహిమాంII
                                                         భక్త కన్నప్ప

8. "శ్రీ మహాదేవదండకం" :చిత్రం: వినాయక విజయం
 శ్రీమన్మహాదేవదేవా! అమేయ ప్రభావా! భవా! భవ్య కారుణ్య భావా! శివా! భవానీప్రియా! చిన్మయానంద హృదయా! అద్వయా! దివ్య పంచాక్షరీ వేద మంత్రాలయా! అవ్యయా! ప్రకృతీపురుషులై, శక్తియున్నీవె, ఆధార చక్రాన విహరించు సంరక్షితో సృష్టి కావించి, పాలించవే! సూర్యచంద్రాగ్నులే నీదు నేత్రాలుగా! నాల్గు వేదాలు నీ శంఖు నాదాలుగా! భూమి నీపాద పీఠమ్ముగా! గంగయే నీ శిరోరత్నమ్ముగా! తేజమే నీకు నీరాజనమ్ముగా! వాయువే వింజామరమ్ముగా! నభము ఛత్రమ్ముగా! పంచభూతాలు సతతమ్ము సేవించగా! సప్త పాదోనిధీ సుప్త శైలేంద్రముల్, సర్వ లోకాలు, తీర్ధాలు, నీ కుక్షిలో సదా ప్రక్షిప్తమై యుండవే! విశ్వరూపా! నమో వేదభువనప్రదీపా! సంతతానందకేళీకలాపా! జగత్శ్రీపతీ! శ్రీలసత్భూత వస్తూ సదానందమూర్తీ! నమో దేవతాచక్రవర్తీ! నమస్తే నమస్తే నమఃII
                                                      వినాయక విజయం
                                       

                                       


9. "శ్రీ రామ దండకం" :చిత్రం: శ్రీరామ రాజ్యం
( హే!) దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహనా! నిత్య కారుణ్య సౌజన్య సద్భావనా! సర్వ శస్త్రాస్త్ర శక్తి ప్రభా ధారణా! సత్య సింహాసనా! ధర్మ సంస్థాపనా! న్యాయ విశ్లేషణా పోషణా! స్నేహ సంభాషణా భూషణా! వేదవేదాంగ శాస్త్రార్ధ విద్యాధనా! ఆదికావ్యామృతానంద సంవర్ధనా! రామ! సీతా సతీ ప్రాణనాధా! సదా జానకీ ప్రేమగాధా! మహారాజ్ఞి వైదేహి వీణా వినోదా! నమస్తే నమస్తే నమస్తే నమఃII
శ్రీరామ రామేతి కారుణ్య ధామా! విభాపూర్ణ నామా! మహాభక్తనోద్దండ దోర్దండ భీమా! కోదండ రామా! శతానీక భక్తాళి పరిపూర్ణధామా! ధరాజాత సౌమిత్రి ప్రేమాభిరామా! సూర్యాన్వయాంబోధి సోమా! శ్రీ జానకీరామా! నమస్తే నమస్తే నమస్తే నమఃII
                                                    శ్రీరామ రాజ్యం
                                
శ్రీరామ చరిత దండకం
: రచన: ఎ.వేణుగోపాల్                :గానం: ఘంటసాల                 :సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
భక్త మందార! రఘురామ! భద్రాద్రి రామా! పరంధామా!
వందారు మందార! రఘువంశ సుకుమార! రఘువీరా!
వందే తవ పాదపంకజంII
పుత్రకామేష్టి యాగ ప్రభావంబునన్ బుట్టి, పిత్రాజ్ఞచే విశ్వామిత్ర యాగంబు తరింపంగ, ఘోరాటవీ మధ్య తాటకాదులన్ దునిమి, మునివర్యు యాగంబు నిర్విఘ్న మొనరించి, పాషాణ రూపమున పడియున్న సతికి త్వత్పాద ధూళి  సోకింప, నిజ రూపమున్ దాల్చి అహల్యా సతిన్ భజియించె నిన్ను రఘువంశసోమా! కల్యాణరామా! మునిసత్తముని వెంట జనకుని పుర మేగి, జమదగ్ని గురు చాప ఘుంకృతుల్ వ్యాపింప, అవలీలగా ద్రుంచి, జానికిని చేపట్టి, నిజపురంబరిగిన శ్రీరఘురామా! సీతామనోభిరామా! మందరా ప్రేరిత మాత కైకేయిచే పట్టాభిషేక క్రియాంతరాయంబు కలిగించ, నారచీరల్ దాల్చి, సీతామహాసాధ్వి, సౌమిత్రి నీ వెంట నడ, చిత్రకూటాద్రి చిరకాలమున్ గడిపి, మాయలేడిని గాంచి ప్రేయసి వాంఛింప, అవ్వాంఛ దీర్చంగ వేటకై నీవరుగ, దుష్ట రావణబ్రహ్మయే ముష్టి యిడుమని చేరి, వైదేహి నెత్తుకొని వాహినిన్ దాటి లంకలో దాచంగ, "సీతా! సీతా!" యటంచు పర్ణశాలను జేరి, పడతిని గానక, కానలన్ గాలించి, ఋష్యమూకము జేరి, చెట్టుచాటున దాగి వాలిని హతమార్చి, నిజదార వెతికింప ఆంజనేయుని పంప, లంకాపురిన్ జేరి,  జానకిని గాంచి, ఆనవాలును యిచ్చి పుచ్చుకొని, "చూచితి సీతామహాసాధ్విని, రామా!" యటంచు చేరగా, వాయుపుత్రుని గాంచి ఆలింగనము సల్పితివో, అనుపమ గుణసాంద్రా! రామచంద్రా! వానర బలమున వారిధి నిర్మించి, దశకంఠు దర్పమును నాశనము గావించి, జానకిని విడిపించి, అయోధ్య పురమేగి, ముల్లోకములు పొగడ, సౌభ్రాత్రవిభ్రాజితభ్రాతలన్ సర్వ సర్వంసహా గీర్వసంబౌగా బాహూద్వయంబునన్ కౌగిటన్ జేర్చి, సీతాసమేతుండవై సుఖాంబోధి నోలలాడించి, రామరాజ్యంబు స్థాపించినాడవో, రామచంద్రా! పాహిమాం! పాహి పాహిII
                                                      శ్రీరామ చరిత దండకం
                              




   







1 comment:

  1. మరీ మరీ ధన్యవాదములు

    ReplyDelete